15 కిలోలు పెరిగిన పొట్ట.. ఆదివాసి మహిళ ఈదమ్మ వ్యధ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి / అచ్చంపేట :-
రెక్కాడితే కానీ డొక్కలు నిండని బిడ్డల పరిస్థితి ధీనంగా ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బికే లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళ అర్థం కాని వ్యాధితో తీవ్ర అవస్థలు పడుతుంది.ఆర్థిక స్తోమత లేక తినడానికే కష్టంగా ఉన్న సందర్భంలో ఇప్పటికే ఆరోగ్యం కోసం సుమారు రూ.80 వేలు అప్పు చేసింది. అయినా ఆరోగ్యం నయం కాకపోవడంతో అవస్థతో బాధపడుతోంది. గత ఐదారు సంవత్సరాలుగా కడుపు ఉబ్బడం ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని ఈదమ్మ *ప్రజా గొంతుక న్యూస్ తో* తెలిపింది. ఏపీలోని ఎర్రగొండపాలెం వద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో రెండుసార్లు చికిత్స చేయించానని ఆ క్రమంలో కడుపులో నీరు తీసివేశారని పేర్కొంది. కష్టపడితేనే తమకు రోజు గడుస్తుందని, ఆరోగ్యం కోసం ఇప్పటికే అప్పుచేసి చాలా ఖర్చు చేశానని మహిళ వాపోయింది. అయినా మళ్లీ గత వారం పది రోజుల నుండి నా పొట్ట విపరీతంగా పెరుగుతూ శ్వాసకు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
స్థానికంగా ఉన్న వైద్యులకు గ్రామానికి వచ్చే వైద్య సిబ్బందికి నా బాధ చెప్పుకున్నప్పటికీ ఎవరు పరిష్కారం చూపలేకపోతున్నారని తెలిపింది. ప్రస్తుతం చాలా ఆయాసంగా ఉందని ఆవేదన చెందింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని భర్త పశువుల కాపరిగా పనిచేస్తున్నాడని తెలిపింది. ఆరోగ్యం విషయం తను పట్టించుకోవడం లేదని బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం అని అంటున్నట్లు బాధ పడుతూ తెలిపింది. ఆవులు కాస్తూ జీవనం గడుపుతున్న మా కుటుంబం డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వాపోయింది. ఆదివాసి గిరిజనుల వైద్యం ఇతర సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఐటిడిఏ యంత్రాంగం ఉన్నప్పటికీ ఆదివాసులకు ఎక్కడ ఆ కార్యాలయం నుండి ఎలాంటి సదుపాయాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మర్రిపల్లి ఈదమ్మకు మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈదమ్మను బతికించవలసిందిగా డీసీసీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ డిమాండ్ చేశారు.