స్థానిక కోర్టు భవన సముదాయానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
అత్యాధునిక వసతులతో హుజూర్ నగర్ నడిబొడ్డున అతి పెద్ద న్యాయస్థాన భవన సముదాయాల నిర్మాణం
న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తా
కాంగ్రెస్ అభ్యర్థి,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ప్రజాగొంతుక న్యూస్/ సూర్యాపేట జిల్లా
తాను గతంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన కాలంలో హుజూర్ నగర్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానని అదే వరవడిని మునుముందు కూడా కొనసాగిస్తానని నల్లగొండ ఎం పీ, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయవాదులకు హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ హాలు నందు బుధవారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన పాల్గొని న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. తన 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించి తన నియోజకవర్గాన్ని లక్షల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పరిచానని, కృష్ణా నది మీద 50 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి, ఎన్ఎస్పి కాల్వ చివరి భూముల కు నీరందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ లను ఏర్పాటు చేయటం, రహదారుల విస్తీర్ణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం, గూడు లేని నిరుపేదల కొరకు ఇండ్ల నిర్మాణం, బైపాస్ రోడ్డు నిర్మాణం, ప్రతి తండా, ప్రతి గ్రామ పంచాయతీని డాంబర్ రోడ్ల ఏర్పాటుతో మండల కేంద్రానికి అనుసంధానించడం తదితర అభివృద్ధి కార్యక్రమాలు తన రాజకీయ జీవితానికి మచ్చుతునకలన్నారు తనకు మరొకసారి అవకాశం కల్పించి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపితే స్థానిక కోర్టు భవన సముదాయానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయింపజేసి అత్యాధునిక వసతులతో తెలంగాణ రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నడిబొడ్డున అతి పెద్ద న్యాయస్థాన భవన సముదాయాల నిర్మాణానికి, న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. హుజూర్ నగర్ కు నూతన న్యాయస్థానాల మంజూరి కొరకు వాటిలో తగిన మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషిచేసి న్యాయ రంగ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని తన కర్తవ్యం గా అందిస్తానన్నారు.న్యాయవాదులందరూ తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి తనకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు అనంతరం ఎంపీని న్యాయవాదులు శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, శ్రీనివాసుల రవికుమార్, నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాసరెడ్డి, చల్లా కృష్ణయ్య, కుక్కడపు బాలకృష్ణ, చనగాని యాదగిరి, నవీన్ కుమార్, నాగేష్ రాథోడ్, క్రాంతి కుమార్, మహిళా న్యాయవాదులు రేణుకాదేవి, రమాదేవి, ప్రదీప్తి, అధిక సంఖ్యలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.