*గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోండి
*శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి
*షాద్ నగర్ లో వినాయక మండపాలను సందర్శించిన పోలీసు అధికారులు
ప్రజా గొంతుక : రంగారెడ్డి జిల్లా బ్యూరో
ఈ నెల 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై షాద్ నగర్ పట్టణంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి షాద్ నగర్ ఏసిపి రంగస్వామి, రూరల్ సిఐ లక్ష్మీరెడ్డి, ఎసై దేవిక ఇతర అధికారులతో కలిసి పట్టణంలో పలుచోట్ల పర్యటించారు. గణేష్ మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న నిర్వాహకులతో మాట్లాడారు వారికి దిశ నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు ఫరూక్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాన్ని సందర్శించారు. స్ధానిక న్యాయవాది కానుగు మదన్ మోహన్, జంగయ్య ఇంకా పలువురు నిర్వాహకులతో మాట్లాడారు. అంతకుముందు స్థానిక మీడియాతో కూడా డిసిపి నారాయణరెడ్డి మాట్లాడారు. డిసిపి పరిధిలో మొత్తం 1800వినాయక మండపాలు ఏర్పాటు అయ్యాయని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
ఇప్పటివరకు జరిగిన అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలు, వేడుకలు ఇతర అన్ని కార్యక్రమాలు సాఫీగా జారిగాయన్నారు. ఈసారి గణేష్ నిమజ్జనం 28 వ తేదీన మరియు 30 ఏళ్ల తర్వాత ఈద్ మిలాధ్ ఉన్ నబీ ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నందున. వేడుకలను కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలన్నారు. ఇందులో భాగంగా స్ధానిక పోలీసు అధికారులకు డిసీపి దిశా నిర్దేశం చేశారు.
ఈ సంవత్సరంలో జరుపుకొనే అతి పెద్దదైన గణేష్ వేడుకలను ‘‘ఇన్సి డెంట్ ఫ్రీగా ఘనంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల్లో సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగిన వెంటనే 100 డయల్ చేయాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ వినాయక మండపం వద్ద పోలీసులను నిర్వాహకులు సన్మానించారు..