లేగ దూడ పై చిరుత దాడి
మండలంలో కలకలం రేపుతున్న చిరుత సంచారం
పాపన్నపేట ప్రజా గొంతుక న్యూస్
చిరుత దాడిలో లేగ దూడ హతమైన సంఘటన మండల పరిధిలోని అన్నారం శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. టేక్మాల్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ నాయక్ తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూన్యా నాయక్ తన పశువులను రోజు మాదిరిగానే గ్రామ శివారులో గల పశువుల పాకలో కట్టేశాడు. తెల్లవారు జామున పశువులు అరుపులకు మెలుకున్న మున్యా పశువుల వద్దకు వెళ్లి చూడగా లేగ దూడ కనిపించకపోవడంతో ఉదయం పశువుల పాక వద్ద చిరుత అడుగులను గుర్తించి అటవీ ప్రాంతం వైపు వెళ్ళి చూడగా దూడ చనిపోయి ఉంది. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా టేక్మాల్ సెక్షన్ అధికారి శ్రీనివాస్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అటవీ ప్రాంతంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా చిరుత పులి దాడి చేసి దూడను చంపినట్లు గుర్తించారు. గ్రామస్తులు ఒంటరిగా ఆటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారంతో అన్నారం చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.