పర్ణశాలలో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదు
దుమ్ముగూడెం పోలీస్
ప్రజాగొంతుక ప్రతినిధి/ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలం పర్ణశాల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనుల వల్ల ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం వేడుకలు జరుపుటకు అనుమతి లేదని, మండలంలోని అన్ని విగ్రహాలు భద్రాచలంలో నిమజ్జనం చేయుటకు దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు చేసి ఉన్నామని దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ విషయం గురించి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు సమాచారం ఇవ్వడం జరిగిందని, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటికి గణేష్ మండప నిర్వాహకులు బాధ్యత వహించాలని తెలిపారు. కావున గణేష్ నిమజ్జన వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరారు.