Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

చెరువులోకి దూకి గురుకుల టీచర్‌ ఆత్మహత్య!

 

ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా.

 

చెన్నూరు, అక్టోబరు 17: విధి నిర్వహణలో ఇబ్బందులొస్తే అండగా నిలవాల్సిన తోటి ఉపాధ్యాయురాళ్లు, మహిళా ప్రిన్సిపల్‌ అలా చేయకపోగా.. పనిగట్టుకొని ఆమెకు సమస్యలు సృష్టించారు! ఆపై ఆ సమస్యలకు ఆమే కారణం అన్న వాతావరణం సృష్టించి.. ఆమెను సూటిపోటి మాటలతో బాధించారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉపాధ్యాయురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు.. అక్కడ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న 35 ఏళ్ల తిరుమలేశ్వరి. తన చావుకు ప్రిన్సిపల్‌, తోటి ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణం అని ‘వాయిస్‌ రికార్డు’లో తిరుమలేశ్వరి పేర్కొన్నారు. తిరుమలేశ్వరి స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్‌. ఆమెకు భర్త సంపత్‌, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. కరీంనగర్‌ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమె భర్త సందీప్‌ వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్‌ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో వంద మంది వరకు సహాయ సిబ్బందికి సంబంధించి భోజన ఏర్పాట్ల బాధ్యతలను (మెస్‌ కమిటీ ఇన్‌చార్జి) తిరుమలేశ్వరికి అప్పగించారు. ఏర్పాట్లలో ఆమెకు సహాయంగా ఉండేందుకు కమిటీలో 10 మందిని నియమించారు. గత నాలుగు రోజులుగా తిరుమలేశ్వరి ఈ బాధ్యతల్లో ఉన్నారు. ఆమెకు కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ సహకరించలేదు. భోజన ఏర్పాట్ల బాధ్యతను తానొక్కత్తే పర్యవేక్షించాల్సి రావడంతో తిరుమలేశ్వరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనకు సహకరించాల్సిందిగా కమిటీలోని సభ్యులను అడిగినా వారు ససేమిరా అన్నారు. ఆదివారం టిఫిన్‌, భోజనం ఆలస్యంగా అందడంతో అందరూ తిరుమలేశ్వరినే తప్పుబట్టారు. విఽధి నిర్వహణలో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు భర్త సంపత్‌ తిరుమలేశ్వరిని గురుకులంలో దింపి వెళ్లాడు. గంట తర్వాత భర్త ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. రెండు మూడుసార్లు ఫోన్‌ చేయగా ఒక వ్యక్తి లిఫ్ట్‌ చేసి పెద్ద చెరువు కట్టపై బ్యాగు ఉందని, ఫోన్‌ మోగడంతో లిఫ్ట్‌ చేశానని చెప్పాడు. వెంటనే సంపత్‌ చెరువు కట్ట వద్దకు వెళ్లగా అప్పటికే తిరుమలేశ్వరి చెరువులో దూకినట్లు గుర్తించాడు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించగా తిరుమలేశ్వరి మృతదేహం లభ్యమైంది. మృతురాలి సెల్‌ఫోన్‌లో.. కొందరి వేధింపులే తిరుమలేశ్వరి వాయిస్‌ రికార్డు ఉందని సీఐ వాసుదేవరావు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.