కన్న కొడుకే గొంతు నలిపి చంపేశాడ..?
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
స్థానిక ఎస్సై మహిపాల్ రెడ్డి, మృతురాలి కూతురు ఎర్రోళ్ల కవిత తెలిపిన వివరాల ప్రకారం..
అన్నారం గ్రామానికి చెందిన దనమొల్ల గంగయ్య, శంకరమ్మలకు నలుగురు సంతానం. గత కొన్ని సంవత్సరాల క్రితమే గంగయ్య మృతి చెందగా శంకరమ్మ (57) కూలీ పనులు చేస్తూ ఇద్దరి కుమార్తెల వివాహం చేసింది.
మిగతా ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు నీటి ప్రమాదంలో మృతి చెందగా, చిన్న కుమారుడు ప్రసాద్(26)ను అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ప్రసాద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్ తరచూ అమ్మతో నగదు గురించి గొడవ పడేవాడు.
సోమవారం రాత్రి నిద్రపోయి.. మంగళవారం ఉదయం చూసేసరికి అమ్మ చనిపోయి ఉందని ప్రసాద్ అక్క అయిన ఎర్రోళ్ల కవితకు ఫోన్ చేసి చెప్పాడు.
కవిత హుటాహుటిన ఇంటికి చేరుకొని అమ్మను చూడగా మృతి చెంది ఉంది. దీంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి గొంతు భాగంలో నులిమినట్లు కమిలిపోయి ఉండడాన్ని గుర్తించారు.
రైతు బీమా సొమ్ము కోసం మా తమ్ముడు ప్రసాద్ అతని భార్య కవితలు.. మా అమ్మను హతమార్చి ఉంటారని ఎర్రోళ్ల కవిత ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.