నందమూరి తారక రామారావు100 రూ నాణెం నేడు విడుదల
*ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
న్యూఢిల్లీ: ఆగస్టు 28
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణెం సోమవారం విడుదలకానుంది.
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల చేస్తారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో నాణెం తయారు చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో పనిచేసిన సన్నిహితులు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో 20 నిమిషాలపాటు వీడియో ప్రదర్శన ఇస్తారు.
సుమారు 200 మంది వరకు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు ఇతర నందమూరి కుటుంబసభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించారు. ఆ తర్వాత స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలలో తనదైన చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది.
ఈ నాణెంపై మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..