పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల ప్రక్రియపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్
-ఎన్నికల శిక్షణా తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
-ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రజా గొంతుక పెద్దపల్లి :
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగిఉండాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, శ్యాం ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమ, నిబంధనలపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండటం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉంటే నమ్మకంతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించవచ్చని కలెక్టర్ అన్నారు.
ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధులపై ఎన్నికల కమిషన్ అందించే పుస్తకాలను సంపూర్ణంగా చదవాలని, ముఖ్యమైన సెక్షన్, నిబంధనలు హైలైట్ చేసుకోవాలని, మనం నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని అన్నారు.
పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాలలో పాటించాల్సిన నిబంధనలు, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ మధ్యలో కనెక్షన్, ఓటింగ్ కంపార్ట్మెంట్ రూపొందించడం, ఓటరు గోప్యంగా తన ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లపై ప్రెసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఉన్న హక్కులు, బాధ్యత లను సంపూర్ణంగా తెలుసుకొని ప్రతి పోలింగ్ అధికారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నూతన సూచనలు ఆదేశాలు జారీ చేస్తుందని వాటిని పాటించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మాట్లాడుతూ,, ప్రణాళికాబద్ధంగా ఎన్నికలు నిర్వహించుట కోసం ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించుకొని వాటికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ,, నిబంధనల మేరకు, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని, పోలింగ్ కేంద్రం పరిధిలో వంద మీటర్ల పరిధిలో రెండు రోజుల వరకు ప్రిసైడింగ్ అధికారికి జ్యుడీషియల్ హక్కులు ఉంటాయని, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు .
అనంతరం మాస్టర్ ట్రైనర్ మధు, హరీ ప్రసాద్, జాకీర్ హుస్సేన్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్, తహసిల్దార్లు, సెక్టార్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహయ ప్రిసైడింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.