*పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
**సెప్టెంబర్ 25 లోపు ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం పూర్తి
**ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన వసతుల కల్పనకు కృషి
**ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఓటర్ నమోదు కార్యక్రమం పై తహసిల్దారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
ప్రజా గొంతుక పెద్దపల్లి :
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంభందిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ , శ్యాం ప్రసాద్ లాల్ లతో కలిసి ప్రజావాణి దరఖాస్తులు, ధరణి, గృహలక్ష్మి, ఓటరు జాబితా సవరణ దరఖాస్తులు, మీ సేవా తదితర అంశాలపై తహసిల్దార్లతో రివ్యూ నిర్వహించారు.
*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ*
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సెప్టెంబర్ 25 లోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, టాయిలెట్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ చివరి నాటికి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58 సంబంధించి అర్హులందరికీ పట్టాల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ అన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించి జిల్లాకు కేటాయించిన ఇండ్లకు లబ్దిదారులను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో త్వరితగతిన ఎంపిక చేసి, రెండు వారాల్లో ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కింద వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజల నుంచి ఒక సమస్యపై పలుమార్లు దరఖాస్తులు రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ తెలిపారు. మీసేవ ద్వారా ప్రజలకు సకాలంలో ఆదాయ దృవీకరణ పత్రాలు,కుల ధ్రువీకరణ పత్రాలు,ఇతర ధ్రువీకరణ పత్రాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ధరణి లో నమోదయ్యే ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, హనుమానాయక్, కలెక్టరెట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఈ విభాగం సూపరిండెంట్ పుష్పలత, తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.