ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణ….రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ నోడల్ అధికారి నియామకం
పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు చర్యలు
సి విజల్ యాప్ వినియోగంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలి
ఓటరు స్లిప్పుల పంపిణీ, వెబ్ క్యాస్టింగ్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి
ప్రజా గొంతుక పెద్దపల్లి :
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణను జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ , ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
*రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ,* పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించు కోవాలని, దీనికి అవసరమైన మేర యంత్రాంగం సిద్దం చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో ఉండేకంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పులు అందలేదని గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, వీటి నివారణ కోసం ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని, పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేసి వాటి పంపిణీ పకడ్బందిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ ను రాజకీయ పార్టీలప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని, వివిధ రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లను సైతం ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని అన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రతి రోజూ నివేదికలు సమర్పించాలని, ప్రతి ఒక్క ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాల రిజిస్టర్ కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థులకు, వారి అనుచరులకు సి విజల్ యాప్ పై అవగాహన కల్పించాలని, సి విజల్ యాప్ ను విస్తృతంగా వినియోగించడం వల్ల పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
*వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,* మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో ఉన్న మండలాలకు ములుగు జిల్లా అని ముద్రణ జరిగిందని, అదే విధంగా పోలింగ్ సమయం సైతం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అని ముద్రించారని, దీనిని సవరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఈడిఎం కవిత, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.