విజయవంతమైన పివైఎల్ డివిజన్ మహాసభలు
యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట
నియోజకవర్గం,ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ పాల్వంచ రెవిన్యూ డివిజన్ మహాసభలు అశ్వారావుపేట మండల పరిధిలోని కొత్త కావడిగుండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం జెండాను డివిజన్ అధ్యక్షుడు కాక వెంకటేష్ ఆవిష్కరించారు.
కాకా వెంకటేష్, కుంజ అర్జున్ అధ్యక్షతన జరిగిన మహాసభలో అమరవీరుల సంతాప తీర్మానాన్ని డివిజన్ కార్యదర్శి కొరస రామకృష్ణ ప్రవేశపెట్టగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ మహాసభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే యువశక్తి ఎంతో ముఖ్యమైనదని,
నెత్తురు మండించి శక్తులు నింపే యువతరం ఈ దేశానికి కావాలని ఒక మహాకవి అన్నట్లుగా యువతతోనే అభివృద్ధి ఆధారపడి ఉందని, అటువంటి యువశక్తిని ఈరోజు పాలకులు అనేక ప్రలోభాలకు గురిచేసి నీరుగారుస్తున్నారని, యువతకు ఉపాధి కల్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వాలు, ప్రణాళిక అబద్ధంగా ఉపాధి కల్పనలు లేక యువత పెడదారి పడుతుందని,
అటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని, ప్రశ్నించే వైఖరితో ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి 23 ఏళ్లకే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, ఎందరో త్యాగధనులు తమ యవ్వన ప్రాయంలోనే దేశం కోసం త్యాగాలు చేశారని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత ఉద్యమించినప్పుడు మాత్రమే అందరికీ సమాన అవకాశాలు గల సమాజాన్ని చూడగలుగుతామన్నారు. ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ ఆధ్వర్యంలో సమాజం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ సామాజిక అభివృద్ధి కోసం నడుంబిగించాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో
సిపిఐ ఎంఎల్ ప్రజా పందా జిల్లా నాయకులు కంగాల కల్లయ్య,పివైఎల్ జిల్లా అధ్యక్షుడు, వాసం బుచ్చిరాజు లు ప్రసంగించగా సిపిఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్ ముగింపు ఉపన్యాసం చేశారు. సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వారు చేసిన గీతాలాపనులు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ నలుమూలల నుండి యువజన సంఘం నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*నూతన కార్యవర్గం ఎన్నిక*
ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ డివిజన్ మహాసభల సందర్భంగా డివిజన్ నూతన కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా కాక వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా కొర్సా రామకృష్ణ, కోశాధికారిగా కుంజా అర్జున్ తో పాటు పద్ధం లక్ష్మణరావు, బాడిస లక్ష్మణరావు, కంగాల గోవిందరావు, ఓరుగంటి శ్రీను, నీలం భాస్కర్, తదితరులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం అమరవీరుల పాటలతో సభ ముగిసింది.